హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డిని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (విజయ డెయిరీ) చైర్మన్‌గా నియమించారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
పెండింగ్ దరఖాస్తులు 1.27 లక్షలు
హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో 1,27,424 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నవి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26,734 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి, వికారాబా ద్ జిల్లాల్లో పదివేల చొప్పున పరిషరించాల్సి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే.. అత్యధికంగా అడిషనల్ కలెక్టర్ స్థాయి లో పరిషరించాల్సినవి పెం డింగ్ ఉన్నవి. అడిషనల్ కలెక్టర్ల దగ్గర 37, 905, తహసీల్దార్ల వద్ద 35,672, ఆర్డీవోల దగ్గర 27,512, కలెక్టర్ల దగ్గర 26,335 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ‘
మార్గదర్శి’ ఎగవేతలపై ఆరా తీయండి
హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ తమ ఖాతాదారుల్లో ఎవరికైనా నగదు చెల్లింపులు ఎగవేసిందేమో తెలుసుకోవాలని, అందుకోసం తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ దినపత్రికల ద్వారా నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వర్‌రావు ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి కేసుపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు 2 వారాల సమయం కావాలని మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. అనంతరం పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆన్లైన్ ద్వారా తన వాదన వినిపిస్తూ.. చట్టవిరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్టు ఆర్బీఐ తన కౌంటర్లో పేర్కొన్నదని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను ప్రాసిక్యూట్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.