హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ‘పోరాటాలు బీసీలవి.. పదువులేమో మీకా? బీసీల ఓట్లు కావాలి కానీ పదువులివ్వరా?’ అని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై శంకర్ మాట్లాడారు. ‘బీసీ నేతను ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? ఎన్నికలు వస్తేనే మీకు బీసీలు గుర్తుకొస్తారు. బీసీల్లో సమర్థులు లేరా? నమ్మకస్తులు లేరా? మంత్రివర్గంలో ఎంత మంది బీసీలు ఉన్నారు? కార్పొరేషన్ చైర్మన్లల్లో బీసీలెంత మంది?’ అంటూ నిలదీశారు. బీసీ మంత్రులకు శాఖల కేటాయింపులోనూ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ చేతుల్లో ఉన్న అధికారాన్ని పంచాలని, తద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని, కామారెడ్డి డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఆ డిక్లరేషన్‌కు కట్టబడిలేరా? అంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. 42శాతం రిజర్వేషన్ల పేరుతో ఒకే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, మిగతా 99 అంశాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వ జమెత్తారు. చట్టాలు ఎలా చేస్తారో సర్కారుకు తెలియదా? అని మండిపడ్డారు.