చేర్యాల, డిసెంబర్ 11 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(MLA Palla Rajeshwar Reddy) వారి ఆశీస్సులతో మల్లన్న క్షేత్రాన్ని, జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, స్వామి కృపతో తాను అద్భుత విజయం సాధించానని జనగమా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం మొదటిసారిగా సోమవారం ఆయన కొమురవెల్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జనవరి 7న జరిగే కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని, స్వామి వారి ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. అలాగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, వసతుల పై త్వరలో ఆలయవర్గాలతో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ సర్కారు పాలనలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. క్షేత్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనుల పై త్వరలో సమీక్ష జరిగి వాటిని సకాలంలో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటునాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తలారీ కీర్తన, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్లు మేక సంతోష్, గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, సర్పంచ్ సార్ల లత తదితరులు ఉన్నారు.