బచ్చన్నపేట, జనవరి 10 : ‘కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. వాటికి భయపడేది లేదు. ప్రతి గ్రామానికి వస్తా.. సమస్యలను పరిష్కరిస్తా’నని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేటలో బీఆర్ఎస్ కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కారు విజిలెన్స్, తనిఖీలు, కేసులు పెట్ట డం, బెదిరింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.
కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ప్రొటోకాల్ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. మంత్రి స్థాయిలో కూడా ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం బ్యాంకుల్లో నిల్వ ఉంచిన రూ.7,500 కోట్ల రైతుబంధు ఇంతవరకు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
అబద్ధాలతో, ఊకదంపుడు ఉపన్యాసాలు, సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాలతో మార్పు అనే పదంతో కాంగ్రెస్ అధికా రం చేజిక్కించుకున్నదని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలమైందని అన్నారు. ప్రతి ఊరిలో చెరువును గోదావరి జలాలతో నింపిన విషయాన్ని గుర్తుచేశారు. ఎంపీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ మెజార్టీ సీట్లు గెల్చుకునేలా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు.