రూ.75 కోట్లతో చిన్న చిన్న పనులు జరిపి ప్రాజెక్టు మొత్తం తామే కట్టామని కలరింగ్ ఇవ్వడమేమిటి రేవంత్? 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తే అది వరల్డ్ రికార్డు అవుతుంది. సీతారామ కాంగ్రెస్ సర్కారే కడితే మరి కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటివరకు తట్టెడు మన్ను ఎందుకు తీయలేదు? రైతు రుణమాఫీ రూ.2 లక్షలతోపాటు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను ఆగస్టు 15లోగా అమలుచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అసెంబ్లీ సాక్షిగా, అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం సగం మంది రైతులకే రుణమాఫీ చేసింది. ఆరు గ్యారెంటీల్లోని కొన్ని హామీలే నెరవేర్చి హరీశ్‌రావును రాజీనామా కోరడం రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం.
– ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు పట్టిన చీడ, పీడ సీఎం రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు, అవాస్తవాలేనని, ఇంత అసభ్య సీఎం దేశంలో మరొకరు లేరని విమర్శించారు. 30 వేల ఉద్యోగాలపై, సీతారామ ప్రాజెక్టుపై సీఎం, మంత్రులవి అన్ని అబద్ధాలేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ అంటున్నారు.. అసలు తెలంగాణలో ఆ ప్రాజెక్టు ఉన్నదా? అని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డి పొద్దట్నుంచి అన్ని చోట్లా బూతులు మాట్లాడారని, ఆయన భాషను చూసి ప్రజలంతా సిగ్గుతో తలదించుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు కూడా సీఎం అబద్ధాలను చూసి సిగ్గుపడుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీతారామప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది.. పైసలు ఇచ్చింది.. నిర్మించింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. కానీ, రూ.75 కోట్లతో చిన్న చిన్న పనులు జరిపి ప్రాజెక్టు మొత్తం తామే కట్టామని కలరింగ్ ఇవ్వడమేమిటని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తే అది వరల్డ్ రికార్డు అవుతుందని ఎద్దేవా చేశారు.
సీతారామ మీరే కడితే మరి కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటివరకు తట్టెడు మన్ను ఎందుకు తీయలేదు? అని నిలదీశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును కేసీఆర్ ఆపాలంటే ఆపారని సీఎం అబద్ధాలు చెప్తున్నారని, ఆ ప్రాజెక్టు మొదలుపెడితే ఖమ్మం జిల్లా దుమ్ము కొట్టుకుపోయేదని మండిపడ్డారు. కృష్ణా నీరు వర్షాలకు వచ్చింది తప్ప మంత్రులు తెచ్చివని కావని, తాము తెచ్చినట్టు చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే చెల్లదని స్పష్టంచేశారు.
రైతు రుణమాఫీపై సీఎంది పెద్దమోసం
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డిది అతిపెద్ద మోసమని పల్లా విమర్శించారు. ‘రాష్ట్రంలో 44 లక్షల మంది రైతుల రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుందని తొలుత రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత రూ.31 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు వేసింది రూ.17 వేల కోట్లు మాత్రమే’ అని మండిపడ్డారు. నిబంధనల సాకుతో సగం మందిపైగా రైతులను తీసివేసి 22.34 లక్షల మంది (46 శాతం)కి మాత్రమే రుణమాఫీ చేసి రైతులను ఉద్దరించినట్టు రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలకడం తగదని హితవు పలికారు.
రేవంత్‌రెడ్డి మీద నమ్మకం లేకే రుణమాఫీ సంబురాలకు రాహుల్‌గాంధీ రాలేదని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రుణమాఫీ చేయించారని చెప్పారు. దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు అనేది సీఎం వైఖరిగా మారిందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ రూ.2 లక్షలతోపాటు 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను ఆగస్టు 15లోగా అమలుచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అసెంబ్లీ సాక్షిగా, అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రకటించారని గుర్తుచేస్తూ ఆ నాటి రాజీనామా లేఖను మీడియాకు చూపించారు.
సగం మంది రైతులకే రుణమాఫీ చేశారని, ఆరు గ్యారెంటీల్లోని కొన్ని హామీలే నెరవేర్చి హరీశ్‌రావును రాజీనామా కోరడం రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైరయ్యారు. ‘హరీశ్‌రావు ఏడుసార్లు ఎమ్మెల్యే. ఉద్యమంలో రెండుసార్లు పదవికి రాజీనామా చేశారు. ఉద్యమంలో రేవంత్‌రెడ్డి ఎక్కడున్నారు?’ అని నిలదీశారు. రేవంత్ భాషను పశువులు కూడా సహించవని, చిల్లర, చిచోరా భాషను మాట్లాడేందుకు తమకు సంసారం అడ్డు వస్తున్నదని అన్నారు. హరీశ్‌రావును తిడితే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టేనని విమర్శించారు. ఉడత ఊపులకు భయపడబోమని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే దాకా సీఎంను వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ పక్షాన నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.
రుణమాఫీ అంకెల గారడీ: కొత్త ప్రభాకర్‌రెడ్డి
రుణమాఫీ ఓ అంకెల గారడీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. హరీశ్‌రావును తిడితే సీఎం తప్పులు ఒప్పులు కావని హితవుపలికారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తున్నదని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారినపడి ప్రజలు దవాఖానల పాలవుతున్నారని మండిపడ్డారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నిధులు లేక సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేవుళ్లను మోసంచేసిన ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి: కౌశిక్‌రెడ్డి
రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టువేసి.. రూ.17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేసి దేవుళ్లను సైతం మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్‌రెడ్డేనని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. సిగ్గుంటే సీఎం రేవంత్ ముకునేలకు రాసి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2018లో రేవంత్‌ను కొడంగల్‌లో హరీశ్‌రావును చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. హరీశ్‌రావును విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదని మండిపడ్డారు. మూసీ కంటే రేవంత్ నోరు కంపు కొడుతున్నదని, ముందు ఆయన నోరును ప్రక్షాళన చేయాలని ఎద్దేవా చేశారు. సీఎం కుర్చీ అని గౌరవం ఇస్తున్నామని, హరీశ్‌రావును నోటికొచ్చినట్టు అంటే సహించబోమని హెచ్చరించారు.
డైవర్షన్ కోసమే రేవంత్ బూతులు: సబిత
44 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు 22.34 లక్షల మందికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, రుణమాఫీ కానీ మిగతా రైతులు రోడ్డు ఎక్కేందుకు సిద్ధమయ్యారని, వారి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్‌రెడ్డి బూతులు అందుకున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేయనందుకు రేవంత్‌రెడ్డి అమరుల స్థూపం దగ్గర ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ బూతుపురాణం అందుకోవడం సిగ్గుచేటని, ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టకపోతే రేవంత్‌కు పూట గడవటం లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎన్నితిట్టినా హామీలపై బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టంచేశారు.