జనగామ, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ‘ఊసరవెల్లిలా రంగులు మార్చి.. పొద్దుతిరుగుడు పువ్వులా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారి రాజకీయ పబ్బం గడుపుకునే కడియం శ్రీహరి.., నీకు గోరీ కడతం.. జాగ్రత్త బిడ్డా.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్’..అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. కడియం శ్రీహరి పదవి పిచ్చోడు.. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి వెళ్తడు..ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు.. గులాబీ జెండా కింద గెలిచిన ఆయనకు.., ఏ మాత్రం సిగ్గు, శరం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పకన, బీఆర్ఎస్లో చేరితే కడియం శ్రీహరిని నాయకులు, ప్రజలంతా కష్టపడి గెలిపిస్తే.. కేసీఆర్, కేటీఆర్, కవితపై అవాకులు, చెవాకులు కూస్తున్నాడని మండిపడ్డారు.
‘రెండుసార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా..? నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో వెళ్లి మోసం చేసింది నువ్వు కాదా..? నీలాంటి వాళ్లకు ఉప ఎన్నిక వస్తది.. నిన్ను పాతర పెట్టడం ఖా యం.. 40 ఏళ్ల రాజకీయం అంటున్నావు.. ఒక డిగ్రీ కాలేజీ అయినా తెచ్చావా..? నేను తీసుకువచ్చిన ఎత్తిపోతలకు కొబ్బరికాయ కొడ్తావా.. సిగ్గు, శరం ఉండాలి..రాజీనామా చేసి గెలిచి అవసరముంటే అప్పుడు కొట్టు’ అని సవాల్ విసిరారు. ‘కేసీఆర్‌పై మాట్లాడే మొనగాడివి కాదు నువ్వు.. ప్రజల దయాదాక్షిణ్యాలు, పార్టీ జెండా కింద గెలిచావ్.. మా నాయకుల దగ్గర నుంచి టికెట్లు పొందావు.. పదవులు పొందావ్.. అధికారం అనుభవించావ్’.. అని మండిపడ్డారు. ఏడాది కాలంలో వెయ్యికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కల్యాణలక్ష్మి చెకుల విషయంలో ఏ ఒకరోజు ఆలస్యం కాకుండా అందించామని చెప్పారు. కొంతమంది కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎన్నికైన వారు కారుకూతలు కూస్తున్నారు.. అలాంటి వారిని ఎక్కడిక్కడ ఎండగట్టాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
సీఎం మెప్పుకోసమే కేసీఆర్‌పై కడియం విమర్శలు ; స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య
సీఎం రేవంత్‌రెడ్డి నుంచి సానుభూతి పొందేందుకే ఎమ్మెల్యే క డియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్లో కేసీఆర్ పుణ్యమా అని ఉపముఖ్యమంత్రితోపాటు పలు పదవులు చేపట్టి, పదేళ్లు కేసీఆర్ కుటుంబాన్ని పొగిడిన నోటితో మళ్లీ ఎలా విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వ ర ప్రాజెక్టు మాదిరిగా ప్రపంచం లో ఎక్కడా లేదని, కేసీఆర్ మా నస పుత్రిక అని మాట్లాడిన ను వ్వు, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల ప్రాజెక్టు అనడం సరైందేనా..? కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ జాతీ య రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులతో ధర్నా చేసింది నువ్వు కాదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కండువాతో గెలిచి కాంగ్రెస్‌లో చేరగానే కేసీఆర్ కుటుంబం అవినీతిమయంగా కనిపిస్తుందా.. అని విమర్శించారు.