హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హామీలు అమలుచేయాలని అడిగిన ఆశా వర్కర్లపై పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, వేతనం రూ.18 వేలకు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ దానిని అమలు చేయకపోగా, దాడులకు దిగుతున్నదని మండిపడ్డారు. తెలంగాణతల్లి గురించి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి, ఆడబిడ్డలకు న్యాయం చేయరా? అని నిలదీశారు.
జీతాలు పెంచమంటే దాడి చేస్తారా?: నిరంజన్‌రెడ్డి
హామీలను అమలు చేయాలని కోరిన ఆశా వర్కర్లపై పోలీసులతో దాడి చేయిస్తారా? జీతాలు పెంచాలని కోరిన ఆడబిడ్డలను వేధిస్తారా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంటింటికీ ఆరోగ్య సేవలు అందిస్తున్న మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులతో దాడి చేయించడం దారుణమని పేర్కొన్నారు. రూ.1,500 ఉన్న ఆశావర్కర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌దేని గుర్తుచేశారు. శాసనసభ, మండలిలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను రాకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు.
ఆశావర్కర్లకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి: దేవీప్రసాద్
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై లాఠీచార్జి చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో ఆశావర్కర్ల వేతనం రూ.18 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు అమలు చేయకపోగా వారిపైనే దాడులు చేయడం దారుణమని విమర్శించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం ఆశా వర్కర్లను ప్రగతి భవన్‌కు పిలిచి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వారి జీతాన్ని రూ.10 వేలకు పెంచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా, అడిగిన వారిపై దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి అని చెప్పుకుంటూ కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించే రోజున మహిళలపైనే దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వారికి క్షమాపణలు చెప్పి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆశావర్కర్లపై పోలీసుల అరాచకం: రాంబాబుయాదవ్
ఆశా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ విమర్శించారు. వందలాది మంది మహిళలను పోలీసులు విచక్షణరహితంగా పిడిగుద్దులు గుద్దుతూ చీరలు లాగారని ధ్వజమెత్తారు. చాలా మంది ఆశా కార్యకర్తలు స్పృహ కోల్పోయారని, నలుగురి పరిస్థితి విషమించడంతో దవాఖానకు తరలించారని తెలిపారు. ఆశాలకు మద్దతు తెలిపిన బీఆర్టీయూ నాయకులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టి జీతాలు పెంచారని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం హామీలు అమలు చేయాలని అడిగితే అరాచకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.