హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు, రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో ముందున్నదని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక స్పష్టం చేస్తే కాంగ్రెస్ నేతలు రోజూ ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య, బీఆర్ఎస్ లీగల్‌సెల్ నాయకుడు కల్యాణ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తెలివి తక్కువవారిగా చూస్తున్నదని, పార్టీలకు అతీతంగా రుణమాఫీ కాని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిస్తే వారితో పాటు బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్న డబ్బులు ఏవని ప్రశ్నించారు. రైతుబంధు కోసం 70లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. రైతు బంధు నిధులపై శుక్రవారం నాటి క్యాబినెట్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అడిగిన రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని, రైతు బీమా, ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక అంశాల్లో అన్ని రాష్ర్టాలను తలదన్నేలా తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని పల్లా తెలిపారు. ఐటీ, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో ముందున్నదని, గత సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాలతోనే ఇది సాధ్యమైందని స్పష్టంచేశారు. రాష్ట్రం అప్పుల పాలైందంటూ, దివాలా తీసిందంటూ సీఎం, మంత్రులు ఏడుపుగొట్టు మాటలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇకనైనా అలాంటి చేతగాని మాటలను ఆపాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల పాలనలో ఒక పాలసీగాని, కొత్త పథకం గాని అమలు చేయలేదని, అయినా రూ.75 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉన్నదని, 2023-24 నాటికి రూ.3.47 లక్షలకు చేరిందని చెప్పారు. దేశ తలసరి ఆదాయం కేవలం రూ.1.83 లక్షలేనని గుర్తుచేశారు. వృద్ధి రేటులో దేశం కంటే తెలంగాణ 193 శాతం ముందున్నదని తెలిపారు. జీడీపీలో తెలంగాణ వాటా 3.8 శాతం ఉండగా 2023-24 నాటికి 4.9 శాతానికి చేరిందని, 2014-15లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.05లక్షల కోట్లు ఉండగా 2023-24 నాటికి రూ.14.62 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ఐటీలో ఉద్యోగుల సంఖ్య, ఎగుమతులు భారీగా పెరిగాయని, వీటికి ప్రధాన కారణం కేసీఆరే అని స్పష్టం చేశారు.