జనగామ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇంకా మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జనగామ రూరల్ మండలం శామీర్‌పేట వద్ద జరిగింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలైన రూ.2 లక్షల రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన కరెంటు, రూ.15 వేల రైతు భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, రూ.4 వేల పింఛన్లకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీ నాయకుల అసలు స్వరూపాన్ని ఎండగట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యా మ మల్లేశ్‌ను గెలిపించాలని కోరారు.