జనగామ, జూలై 14 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గ రైతులకు సాగునీరందించాల్సిన దేవాదుల పంపింగ్ సోమవారం మరోసారి నిలిచిపోయింది. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కడంతో కాలుకు శస్త్రచికిత్సతో కదల్లేని స్థితిలోనూ పంటలు ఎండిపోకుండా వెంటనే రెండో పంపును ఆన్ చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి ఒత్తిడి తేవడంతో అధికారులు ఆదివారం ఆన్‌చేశారు. కొద్దిసేపటికే ధర్మసాగర్ నుంచి గండిరామారానికి పంపింగ్ చేసే పైపులైన్ పగిలిపోయింది. దీంతో అటు తపాస్‌పల్లి, ఇటు గండిరామారానికి క్యుమెక్స్ పంపుల ద్వారా జరిగే లిఫ్టింగ్‌ను దేవాదుల అధికారులు నిలిపివేయించారు. దీంతో పల్లా సోమవారం మరోసారి అధికారులతో ఫోన్లో సమీక్షించారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం వెళ్లే పైపులైన్ పగిలిపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
నాలుగు పంపుల్లో ఏడాదిలో కనీసం రెండు పంపులైనా పనిచేశాయా? అని ప్రశ్నించారు. రెండో మోటర్ ఆన్ చేయమని అడిగితే ఉన్న ఒక్క మోటర్ కూడా నడవకుండా చేశారని విమర్శించారు. యుద్ధప్రాతిపదికన పైపులైన్‌కు మరమ్మతులుచేసి రెండు పంపులు ఆన్ చేయాలని కోరారు. సమ్మక్క బరాజ్ వద్ద నీళ్లు, పంపులు, కరెంటు ఉన్నా నిర్వహణ సరిగాలేదని మండిపడ్డారు. దేవాదుల పంపులు, పైపులైన్ల నిర్వహణ లోపంతో ప్రభుత్వం, అధికారులు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్మసాగర్ నుంచి తపాస్‌పల్లి, గండిరామారం రిజర్వాయర్లకు పంపింగ్ నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. పైపులైన్లకు మరమ్మతుచేసి నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపి పంటలను కాపాడాలని కోరారు.