హైదరాబాద్ : ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ క్రీడలో భాగంగా నచ్చిన వారిని మంత్రులను చేయడానికి టీవీ చానెళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకొని మరల వారి మీదనే సిట్ వేసి అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు. అర్ధరాత్రి అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ డ్రామాలని యావత్ ప్రజలకు తెలుసనీ, ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా వెంటనే విడుదలచేయాలి డిమాండ్ చేశారు.
కాగా, ఎన్టీవీ ఇన్‌ఫుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టుర్లు పరిపూర్ణచారి, సుధీర్లను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తుండగా దొంతు రమేశ్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయగా.. మరో ఇద్దరు రిపోర్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్, మంత్రి వార్త వ్యవహారంలో ఎన్టీవీ న్యూస్ ఛానల్‌పై చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కానీ వారిని అరెస్టు చేసిన విషయాన్ని బయటకు వెల్లడించలేదు. వారిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.