చేర్యాల/ జనగామ, మే 31 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి కరీంనగర్ శంఖారావం.. వరంగల్ ప్రగతి నివేదన.. ఎల్కతుర్తి రజతోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ సభలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచాయి..’ అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న జరిగే ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు శనివారం అమెరికాలోని డాలస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్లో నిర్వహించిన మొదటి సభ సమయంలో అసలు జనం వస్తరా? రారా? అని కొందరు నాయకులు కేసీఆర్తో అంటే మీరు అన్ని ఏర్పాట్లు చేయండి.. జనం వస్తరు.. అని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో అన్నారని గుర్తుచేశారు. ఊహించనంత భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయడం ద్వారా కరీంనగర్ శంఖారావం దేశ చరిత్రలో అతిపెద్ద సభగా నిలిచిందని పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం పోగొట్టుకున్నరో తెలిసింది.. మళ్లీ కేసీఆర్, బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నరు.. ఆ నమ్మకంతో నిర్వహించేదే డాలస్ సభ అని తెలిపారు.