హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరుకావాలంటూ మాసబ్‌ట్యాంక్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. గత నెల 4వ తేదీన బంజారాహిల్స్ స్టేషన్‌కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన కౌశిక్‌రెడ్డి ఆ ఠాణా ఇన్స్పెక్టర్తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. మరుసటి రోజు కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించి, అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయస్థా నం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మాసబ్‌ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరుశురామ్‌కు అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా కౌశిక్‌రెడ్డిని ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలంటూ రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అయితే కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో మాసబ్‌ట్యాంక్ పోలీసుల విచారణకు హాజరుకాలేనని నోటీసుకు కౌశిక్‌రెడ్డి బదులిచ్చారు.