హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రెండో విడత దళితబంధు నిధులడిగిన పాపానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులతోపాటు తనపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ దమనకాండకు భయపడేది లేదని, దళితబంధు లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా సీఎం రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు తెచ్చిన ఈ పథకాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మధి ర నియోజకవర్గం చింతకానీ మండలంలో ని 860 మంది దళితులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెక్కులందించారని, మరి హుజూరాబాద్ దళితులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.
‘ఈ రోజు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు కలెక్టర్‌ను ఉరికించి కొట్టారు. హుజూరాబాద్‌లోని దళితుల కు దళితబంధు నిధులివ్వకుం టే ఇదే తీరులో తిరుగుబాటు చేస్తరు. గుర్తుంచుకో రేవంత్‌రెడ్డి’ అని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. దళితబిడ్డల కోసం జైలుకెళ్లేందుకు కూడా సిద్ధమని తేల్చిచెప్పారు. తన పోరాటం పోలీసుల మీద కాదని,రేవంత్‌రెడ్డి మీదేనని స్పష్టం చేశారు.
కేటీఆర్ పాదయాత్ర చేస్తానని అనగానే రేవంత్‌రెడ్డి ఆగమేఘాల మీద మూసీ చివరలో ప్రజలులేని చోట పాదయాత్ర చేశారని కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దమ్ముంటే తమతో కలిసి హైదరాబాద్‌లోని మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేయాలని సవాలు విసిరారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తీరు మార్చుకోకుంటే ఆయన భాషలోనే బదులిస్తామని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.