హైదరాబాద్: ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా తాను ఆటోలో అసెంబ్లీకి వచ్చానని, అయితే ఆటోను లోపలికి అనుమతించలేదని చెప్పారు. ఆటోను ఎందుకు లోనికి రానివ్వలేదు? కార్లో వస్తేనే రానిస్తారా? అని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఆయనను భద్రతా సిబ్బంది ఆటోలో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆటోలకు అసెంబ్లీలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.