హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): డ్రగ్ టెస్టుకు డబ్బాలు పట్టుకొని రెడీగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చెప్పారు. డ్రగ్ టెస్టులకు రమ్మంటే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రావ డం లేదు? మీరేమైనా డ్రగ్స్ తీసుకున్నరా? మరి భయమెందుకు? అని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్‌ను తాము స్వీకరించామని, డ్రగ్ టెస్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రావాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. కానీ, అనిల్‌కుమార్ ఎవరికీ చెప్పకుండా దవాఖానకు వెళ్లి రమ్మంటే ఎట్లా? అని ప్రశ్నించారు. తన పంచాయితీ అనిల్‌కుమార్‌తో కాదని, రేవంత్‌రెడ్డితోనే అని తేల్చి చెప్పారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని రేవంత్ కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము కౌశిక్‌రెడ్డిని ట్రాప్ చేయలేదని ప్రెస్‌మీట్ ద్వారా ఇంటెలిజెన్స్ చీఫ్‌ను చెప్పమను.. అని రేవంత్‌కు సవాల్ విసిరారు.