కరీంనగర్ కార్పొరేషన్, మే 7 : రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి తన హత్య కు కుట్ర పన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడికి రెక్కీ చేస్తున్నారని తాను చెప్పిన కొద్దిసేపటికే హత్యాయత్నం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదు పు తప్పాయని విమర్శించారు. తాము ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడులు చేస్తరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేనే చంపడానికి వ చ్చారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశా రు. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? అని నిలదీశారు. అయినా తాము దేనికీ భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ గూండాల దాడి అనంతరం కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తాము ఏదైనా మాట్లాడితే చంపేస్తారా? అని ప్రశ్నించారు. తాను ఎక్కడా రె చ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, నగల షాపు దోపిడీ ఘటనలో దొంగలను ఎందుకు పట్టుకోలేదని అడిగితే తనపైనే దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఉన్న రౌడీషీటర్లందరూ తనపై దాడికి వచ్చారని, బీజేపీ గూండాల దాడిలో సీఐకి గాయాలయ్యాయని చెప్పారు. అక్కడున్న అందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, సీపీ, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌కు గన్‌కల్చర్ తీసుకొస్తున్నారని, రౌడీరాజ్యం చే స్తారా? అని ప్రశ్నించారు. గూండాలతో దాడి చేయిస్తే భయపడేది లేదని తేల్చిచెప్పారు.
బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు దమ్ముంటే అభివృద్ధి, రైతుల సంక్షేమం, కరెంటు ఇలా ఏ సబ్జెక్టు మీద అయినా బహిరంగ చర్చకు రావాలని, తెలంగాణ చౌక్‌లో బహిరంగ చర్చకు తాను కేటీఆర్‌ను తీసుకొస్తానని సవాల్ చేశారు. సబ్జెక్టుపై పూర్తి సమాచారంతో చర్చకు రావాలని సూచించారు. బండి సంజయ్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో నగల షాపులో దోపిడీ జరిగి పోలీసులు, ప్రభుత్వం విఫలమైతే వారిని విమర్శించాల్సింది పోయి కరీంనగర్ ప్రజలకు భరోసా, ధైర్యం చెప్పేందుకు వచ్చిన కేటీఆర్‌పై విమర్శలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. సంజయ్ మొదటిసారిగా 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ‘సామాన్యుడిని. నా భార్య పుస్తెలమ్మిన’ అని చెప్పిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రూ.50కోట్లు ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. ఈ డబ్బు అవినీతి చేసి సంపాదించిందా? లేక రేవంత్‌రెడ్డి పంపారా? అని సూటిగా ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను తిట్టే స్థాయి బండి సంజయ్‌కి లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణను ప్రపంచంలో సగర్వంగా నిలిచేలా పనిచేశారని కొనియాడారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
ఎంపీగా గెలిచిన కరీంనగర్ ప్రజలకు ఏం చేశావో చెప్పలేని బండి సంజయ్ తమపై విమర్శలు చేయడం సరికాదని కౌశిక్‌రెడ్డి హితవు పలికారు. కేవలం వినోద్‌కుమార్ వల్లే కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ వచ్చిందని తేల్చిచెప్పారు. మరి బండి సంజయ్ భాగస్వామ్యమేమిటని ప్రశ్నించారు. కేవలం మోదీ వేవ్ వల్లే బండి సంజయ్ రెండు సార్లు గెలిచాడని విమర్శించారు. ఎంపీ ఇంటికి కూతవేటు దూరంలో దోపిడీ జరిగితే తనకేం సంబంధం అని ఒక హోం శాఖ సహాయ మంత్రి అనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. దేశంలో కరీంనగర్ లేదా? బండి సంజయ్ హోం మినిస్టర్ కాదా? దోపిడీ జరిగితే ఆయనకు బాధ్యత ఉండదా? అని నిలదీశారు.
జ్యువెల్లరీలో దోపిడీ జరిగి నాలుగు రోజులైనా సంజయ్ ఒక రివ్యూ అయినా చేశారా అని ప్రశ్నించారు. సంజయ్ ఎందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒకసారి కూడా ప్రశ్నించలేదని నిలదీశారు. ఆర్టీసీ డ్రైవర్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ మాజీ మంత్రులను అరెస్టు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సంజయ్‌ను మాత్రం అరెస్టు చేయకుండా పంప డం, వారిద్దరే ఒక్కటే అనేందుకు నిదర్శనం కాదా అని పేర్కొన్నారు. చేతగాని దద్దమ్మ సీపీ వల్ల కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇదే విషయాన్ని తా ను అసెంబ్లీ సాక్షిగా చెప్పానని పేర్కొన్నారు. క రీంనగర్ సీపీ శాంతిభద్రతలు మరచి జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. సీపీనీ, సీఐని సస్పెండ్ చేయలేదని డిమాండ్ చేశారు.
ఈ నెల 5న కరీంనగర్‌కు వచ్చి వెళ్తున్న ఖలీద్ అనే హైకోర్టు న్యాయవాదిని అలుగునూర్ చౌరస్తాలో ఆయుధాలతో ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు చంపేస్తామని బెదిరించారని పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందులో ఆయుధాలతో అని రాయొద్దని న్యాయవాదిపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఆ న్యాయవాది హైకోర్టులోనూ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. తెలంగాణను బిహార్‌గా మార్చుతున్నారా?, తెలంగాణలో గన్‌కల్చర్ ఏమిటని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు బంగారు ఆభరణాలు, నగదుతో బయటికి రావాలంటేనే భయపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
కరీంనగర్లో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఇప్పటివరకు దోపిడీపై ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కరీంనగర్ ప్రజల శాంతిభద్రతలను కాపాడేందు కు కోసం బండి సంజయ్ సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రజలకు భరోసా కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ మల్లేశం పాల్గొన్నారు.