హైదరాబాద్: బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ అజెండాను ఖరారు చేయడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) విమర్శించారు. అసెంబ్లీలో చర్చించాల్సింది టూరిజంపై కాదని లగచర్లలో రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై చర్చించాలన్నారు. లగచర్ల రైతులు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. నెల రోజులుగా జైల్లో వేసేంత తప్పు అన్నదాతు ఏం చేశారని నిలదీశారు. గుండెపోటు వచ్చిన హీరా నాయక్‌ను బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లారని మండిపడ్డారు. తద్వారా యావత్ తెలంగాణ రైతులను అవమానించారని చెప్పారు. లగచర్లలో జరిగిన టెర్రర్‌పై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అదానీ, అల్లుడు, అన్నదమ్ముల కోసం రేవంత్ భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం తప్ప రాష్ట్రంలో ఏమీ లేదని విమర్శించారు.
వెంటనే ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తే రేవంత్ పీడ వదలిపోతుందని రైతులు అనుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిపై 75 లక్షల మంది రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. అప్పులపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఆర్బీఐ హ్యాండ్ బుక్‌లో పేర్కొన్నదాని ప్రకారం తెలంగాణ అప్పు రూ.3 లక్షల 17 వేల కోట్లే. కానీ, అప్పు రూ.7 లక్షల కోట్లంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని చెప్పారు. మంత్రి భట్టి విక్రమార్కపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తామని వెల్లడించారు.