MLA Padi Kaushik Reddy | హుజూరాబాద్, జూన్ 8: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మం జిల్లాకు ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రోజూ రూ. 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని తెలిపారు. ఈ కుంభకోణంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ హస్తం ఉన్నదని, ఇప్పటివరకు ఆయన జేబుల్లోకి రూ.100 కోట్లు వెళ్లి ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్
శివారులోని కరీంనగర్ రోడ్డు కాకతీయ కాలువ వద్ద ఫ్లైయాష్ తరలిస్తున్న లారీలను పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఒక లారీలో 32 టన్నుల బూడిద తరలించాలని, ఇందుకు విరుద్ధంగా 50 నుంచి 65 టన్నుల ఓవర్‌లోడ్ తీసుకెళ్తున్నారని తెలిపారు. నిత్యం రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మంకు 300 లారీల ఫ్లైయాష్ రవాణా అవుతున్నదని పేర్కొన్నారు. 32 టన్నుల బూడిద సామర్థ్యం గల లారీకి కిరాయి రూ.25 వేలు ఉంటుందని, అయితే ఓవర్‌లోడ్‌తో వెళ్తుండటంతో వాహనాలకు కిరాయి తప్పుతుందని తెలిపారు. ఇందులో నిత్యం రూ.50 లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ జేబులోకి వెళ్తుండగా ఇప్పటివరకు రూ.100 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు.
అధిక లోడుతో వెళ్తున్న లారీలతో రోడ్లు దెబ్బతినడమేగాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తుమ్మనపల్లి వద్ద బూడిద కారణంగా టూవీలర్ అదుపు తప్పడంతో కిట్స్ కళాశాల అధ్యాపకుడు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. రవాణాశాఖ అధికారులను లొంగదీసుకొని ఈ తతంగం నడుపుతున్నారని విమర్శించారు. ఇటీవల 11 లారీలను అధికారులకు పట్టించానని, అయితే అందులో రెండు లారీలకు మాత్రమే కేసు రాసి మిగతాని వదిలిపెట్టడంలో గల ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ స్కాంలో సీఎం రేవంత్‌కు ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బూడిద తరలింపునకు సంబంధించి వే బిల్లులు ఉన్నాయా? అని డ్రైవర్‌ను అడుగగా ఖమ్మంలోని నేషనల్ హైవేకు తీసుకువెళ్తున్నట్టు చిన్న రసీదు తప్ప వేరే కాగితాలు చూపించలేదన్నారు. అక్కడే ఉన్న 45 టన్నుల కెపాసిటీ గల వేబ్రిడ్జి దగ్గర బూడిద లారీని కాంట వేయగా ‘జీరో లోడ్’ అని చూపిస్తున్నదని, దీన్నిబట్టి చూస్తే సామర్థ్యం కంటే ఎక్కువ బూడిద లారీలో ఉన్నట్టు తెలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు.