కొడిమ్యాల, మే 12: మరికొన్ని గంటల్లో లోక్సభ పోలింగ్ ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రెండు నెలల కిందట ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆర్థిక సాయం పేరిట రూ.5 వేల నగదు అందించడం వివాదాస్పదంగా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపూర్కు చెందిన సురుగు రాధ కాలికి ఇన్ఫెక్షన్ కాగా, రెండు నెలల కిందట ఆపరేషన్ చేసి కాలు తొలగించారు. అప్పటినుంచి ఇంటివద్దనే ఉంటూ కొలుకుంటున్నది. ఇన్నిరోజులు సాయం చేయని చొప్పదండి ఎమ్మెల్యే హఠాత్తుగా ఆదివారం రాధ ఇంటికి వెళ్లి రూ.5 వేల నగదు అందజేశారు. దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని, అధికారులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.