Gudem Mahipal Reddy | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఈనెల 25న విచారణ జరపనున్న సుప్రీంకోర్టు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులకు ఎమ్మెల్యే లు స్పందిస్తున్నారు. అందులో భాగంగా మహిపాల్‌రెడ్డి సుప్రీంకోర్టుకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
తాను పార్టీ మారినట్టు, కాంగ్రెస్‌లో చేరినట్టు వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టివేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, రాష్ట్ర శాసనసభకు 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫునే పోటీచేసి గెలిచానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశానని, దాన్ని మీడియా వక్రీకరించిందని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు మహిపాల్‌రెడ్డి పంపిన అఫిడవిట్ కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.