కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 11 : ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతికేందుకు వచ్చిన వారందరూ పేదలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఓ పేదవాడు ఓ బండి కొనుకొని నెలకు రూ.40,000 సంపాదిస్తే ధనవంతుడు అవుతాడా? అని ప్రశ్నించాడు. నగరంలో నివసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని తన ఇంటికి సోమవారం వచ్చిన కులగరణ సర్వే ఎన్యూమరేటర్లతో ఆయన మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే సమయంలో నాడు ఎమ్మెల్యేగా ఆస్తులు, ఖాతాల వివరాలు సేకరించొద్దన్న రేవంత్రెడ్డి, ఈనాడు అవే వివరాలను సమగ్ర కుటుంబ సర్వేలో ఎందుకు సేకరిస్తున్నారని కృష్ణారావు ప్రశ్నించారు. సర్వే పేరుతో పేదలకు ఇబ్బంది జరిగితే.. బీఆర్ఎస్ పార్టీ సహించబోదని, వారికి అండగా ఉంటుదని చెప్పారు. ఉన్నత కులాలతోపాటు మైనార్టీ వర్గాల్లోనూ పేదలున్నారని, వారికీ మేలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాంటి వారికి అన్యాయం వారి పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హకులకు విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర చరాస్తుల వివరాలను ప్రభుత్వం ఎలా సేకరిస్తుందని ప్రశ్నించారు. కులగణన పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహిందేది లేదని చెప్పారు. సర్వేపేరుతో సంక్షేమ పథకాలు కోల్పోయి పేదలకు అన్యాయం జరిగితే అధికారులు గ్యారెంటీ ఇస్తరా? అని నిలదీశారు.
కూకట్పల్ల్లి నియోజకవర్గంలో 4.75 లక్షల మంది ఓటర్లు, 2.70 లక్షల ఇండ్లు ఉన్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివరించారు. హడావుడిగా సర్వే చేసి తప్పుడు సమాచారం సేకరించొద్దని హితవు పలికారు. పేదల ఇండ్లలోకి దౌర్జన్యంగా వెళ్లి సర్వే పేరుతో వివరాలు సేకరించడం సరికాదని సూచించారు. ప్రజలకు ఉన్న అనుమానాలను నివృతి చేయాలని, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. తన వివరాలు ఎన్నికలప్పడు సమర్పించిన నామినేషన్ పత్రంలోనే ఉన్నాయని, మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.