హైదరాబాద్/అమీన్పూర్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేదల ఇండ్ల జోలికి రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఫామ్‌హౌస్‌లు, విల్లాలు కట్టుకున్న పెద్దల అక్రమ కట్టడాలు కూల్చడాన్ని ఏమీ తప్పు పట్టడం లేదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పుర, పటేల్‌గూడ, బీఎస్సార్ కాలనీలో హైడ్రా కూల్చివేసిన పేదల ఇండ్లను బుధవారం ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జీతభత్యాల నుంచి నెలనెలా పోగుచేసిన డబ్బుతో బిల్డర్ల వద్ద కొనుగోలు చేసిన ఇండ్లను కూల్చడం అన్యాయమని పేర్కొన్నారు. దాదాపు 26 ఏండ్ల నుంచి ఉన్న ఇండ్లను కూల్చారని, వాటిలో ఇటీవలే గృహప్రవేశం చేసిన ఇండ్లు కూడా ఉన్నాయని తెలిపారు.
గత 40 ఏండ్ల నుంచి ఈ భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, వాటి ఈసీలు కూడా ఇప్పటికీ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఇండ్లు ప్రభుత్వ భూమిలో నిర్మించి ఉంటే 58, 59 జీవోల ద్వారా నివాసితులకు క్రమబద్ధీకరించవచ్చని సూచించారు. ఆ ఇండ్లు చెరువు ఎఫ్టీఎల్,, బఫర్ జోన్లలో లేవని తెలిపారు. తప్పుడు సర్వే నంబర్ల సమాచారంతో కూల్చివేతలు చేపడితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి, నిర్వాసితులకు పూర్తిగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ బాలమల్లేశ్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహ, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జల్లాలుద్దీన్, రాష్ట్ర సమితి సభ్యుడు వీ ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.