KTR | హైదరాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ): తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రణాళికలు ఫలితాలిస్తున్నాయని తెలిపేందుకు సంతోషంగా, గర్వంగా ఉన్నది. దాదాపు 2000 ఎంఎల్డీ సామర్థ్యంతో హైదరాబాద్ ఇప్పుడు అధికారికంగా 100 శాతం మురుగునీటిని శుద్ధిచేస్తున్న మొదటి భారతీయ నగరంగా మారింది.
గతంలో రూ. 3,866 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. మూసీనది పునరుజ్జీవనం, సుందరీకరణ మొదటిదశలో భాగంగా ఈ పనులు చేపట్టాం. దీనికోసం అప్పట్లో గ్లోబల్ డిజైన్ టెండర్లను కూడా పిలిచారు. హైదరాబాద్‌ను దేశంలోనే మొదటి నూరుశాతం మురుగునీటి శుద్ధి నగరంగా తీర్చిదిద్దుతామని మాటిచ్చాం. ఈ ప్రణాళికలో భాగంగా కోకాపేటలో 15ఎంఎల్డీల సామర్థ్యం గల మొదటి ఎస్టీపీని గతేడాది జూలైలోనే ప్రారంభించాం’ అని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ర్టాన్ని తలసరి జీడీపీలో దేశంలో అగ్రభాగాన నిలిపినట్టు కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించిన 2024 తలసరి జీడీపీ నివేదికను షేర్ చేశారు. తెలంగాణ తరువాతి స్థానాల్లో కర్ణాటక, హర్యానా, తమిళనాడు, గుజరాత్, పుదుచ్చేరి రాష్ర్టాలు నిలిచాయి. దేశ తలసరి జీడీపీ 2,677 డాలర్లు కాగా, తెలంగాణ తలసరి జీడీపీ 4,745డాలర్లుగా ఉన్నది.