హైదరాబాద్, జూన్ 23 (నమస్తేతెలంగాణ) : ‘పేదలన్న ప్రేమలేదు.. ఆడబిడ్డలన్న ఇంగితంలేదు.. అందుకే రేవంత్ సర్కారు పోడు భూములు సాగు చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీ బిడ్డలపై దాడులకు దిగింది. ఆడబిడ్డలను వివస్త్రలను చేసి కొట్టించింది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ మీదికే కాదు.. అడవులపైకీ బుల్డోజర్లు పంపడం సిగ్గుచేటని సోమవారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. 420 హామీలు అమలు చేయ డం చేతగాక, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట రాష్ట్ర రాజధానిలో పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నదని దెప్పిపొడిచారు.
రోడ్ల విస్తరణ, పరిశ్రమలకు భూ సేకరణ పేరిట లగచర్ల, దిలావర్పూర్, పెద్ద ధన్వాడ, చారగొండ, సిరసనగండ్లలో రైతుల పొలాలు, ఇండ్లమీదికి బుల్డోజర్లను పంపి పైశాచికానందం పొందుతున్నదని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే, ఎదిరిస్తే, నిలదీస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేస్తూ దుర్మార్గాలకు ఒడిగడుతున్నదని విమర్శించారు. 420 హామీలను పక్కకు పెట్టి కూల్చే, కాల్చే పథకాలను ముందుకు తెచ్చిందని ఎద్దేవాచేశారు.
హైదరాబాద్‌లో రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పులే బీజేపీ ఇంజినీరింగ్ అద్భుతాలకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ మార్క్ అభివృద్ధిని బహిర్గతం చేసేందుకు ఒక్క సాధారణ వర్షం చాలని దెప్పిపొడిచారు. నిరుడు ఢిల్లీలో కూలిపోయిన ఎయిర్పోర్ట్ స్లాబ్, ఇటీవల వర్షానికి అతలాకుతలమైన చర్లపల్లి రైల్వేస్టేషన్ ఫొటోలను పోస్ట్‌కు జతచేశారు. వాళ్లు నిర్మించిన పైకప్పుల గొప్పతనం గురించి చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్న బీజేపీ నాయకులు.. కాళేశ్వరంపై ఇష్టారీతిన మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. అయినా బీజేపీ తెచ్చిన షేప్ షిఫ్టర్ పైకప్పుల అద్భుతమైన కొత్త మోడల్‌ను ఏ ఏజెన్సీ పరిశీలిస్తుందోనని తాను ఆశ్చర్యపోతున్నానని పేర్కొన్నారు.