KTR | హైదరాబాద్ : 2009-2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో 8,198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాను చెప్పడం లేదని, ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్నే చెబుతున్నానని కేటీఆర్ తెలిపారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు.
నిన్న గవర్నర్ ప్రసంగంలో విద్యుత్ రంగం గురించి చాలా అవాస్తవాలు చెప్పారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం బావుల కాడికి పోవుడు. 2009 నుంచి 2013 మధ్యలో 8198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు రైతులు. ఇది ఈనాడులో వచ్చిన వార్త అని కేటీఆర్ తెలిపారు.
గత పదేండ్ల కాలంలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి. రాష్ట్రంలో వరి నాట్ల కోసం 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారు. ఫ్లోరోసిస్ నుంచి నల్లగొండ ప్రజలకు కేసీఆర్ విముక్తి కల్పించారు. ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది. నేతన్నల ఆత్మహత్యలు బంద్ అయినయ్. నేడు సిరిసిల్ల సిరిశాలగా మారింది. సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించాం. 200 ఉన్న పెన్షన్ను 2 వేలు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంకాపూర్, గంగాదేవిపల్లి గురించి చెప్పేవారు. అది కూడా ఆ గ్రామస్తులు అభివృద్ధి చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం గెలుచుకున్నాం. పల్లెప్రగతితో పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు కేటీఆర్.
ఓట్ల కోసం బస్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. గత పదేండ్లలో రక్తాన్ని రంగరించినం.. మెదళ్లను కరిగించినం, ప్రాణం పెట్టి పని చేసినం కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మా ప్రభుత్వ పనితీరు వల్ల ఐటీఐఆర్ లేకున్నా 2022-23 ఏడాదికి 2 లక్షల 41 వేల కోట్లకు ఐటీ ఎగుమతులకు చేరుకున్నాం. బీజేపీ మోకాలడ్డు పెట్టినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది అని కేటీఆర్ పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్లోనే మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని మీద అతిగతి లేదు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ 40 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నా. మేం చేసిన దాని కంటే బ్రహ్మాండంగా చేసుకోండి అని కేటీఆర్ సూచించారు.