ఐనవోలు, అక్టోబర్ 24: హైడ్రా, మూసీ వద్ద కొందరు పెయిడ్ ఆర్టిస్టులను, ఆడోళ్లను పెట్టి తిట్టిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం సొసైటీ ఆధ్వర్యంలో రాంనగర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రా తెచ్చిందని అన్నారు. దేశంలో మంచి పెద్ద, పెద్ద సిటీలు నీళ్లల్లో ఉన్నాయని, ఒక మంచి ఉద్దేశంతో నాలాపై ఉన్న కుటుంబాలకు ఇళ్లు కట్టిద్దామనుకున్నామని తెలిపారు. మూసీ నదిని మంచిగా తీర్చిదిద్దామనుకుంటే, పెయిడ్ ఆర్టిస్టులు, ఆడోళ్లను పెట్టి తిట్టిస్తున్నారని పేర్కొన్నారు. పదేండ్లు ధ్వంసమైన చెరువులు, కుంటల గురించి అందరికి తెలుసు.. కబ్జాకు గురైన ప్రతి భూమిని వెలికి తీసేందుకు వరంగల్‌కు కూడా వాడ్రా వస్తుందని తెలిపారు.