హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. అందుకు నిదర్శనమే ప్రజాపాలన దరఖాస్తులు, గ్రామసభల ద్వారాఎంపిక చేసిన పథకాలకు రూ.40వేల కోట్లు అవసరమవుతాయని పేర్కొనడమని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గ్రామసభల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. విదేశాల్లో రాజభోగాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు తిరుగుతూ పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. పథకాలు ప్రజలకు కాదు, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకే అని బహిరంగంగా కాంగ్రెస్ నేతలే చెప్తుండటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
దరఖాస్తులు అంటూ ప్రజలను కాంగ్రెస్ నేతల చుట్టూ తిప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి, 400 రోజులు దాటినా అమలుకు నోచలేదని విమర్శించారు. రోజుకో డ్రామాతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేషన్‌కార్డు ఆదాయ పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లని పేర్లు పెడితే సహించేది లేదని వివేకానంద హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే కొత్తగా ఇండ్లు కట్టి వాటికి ఏ పేరైనా పెట్టుకోవచ్చని సూచించారు. ఇప్పటికే కట్టిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. లూటీ చేయడానికి తప్ప కాంగ్రెస్ నేతలు దేనికీ పనికిరారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, 40 శాతం వీధి దీపాలు వెలగకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై పోరాడుతామని తెలిపారు.