హైదరాబాద్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. రేవంత్రెడ్డి వ్యక్తిగతంగా తనకు లబ్ధిచేకూరే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్లో విధ్వంసం సృష్టించడానికే కూల్చివేతలు చేపట్టాడని, అవినీతి సొమ్మును ఢిల్లీకి పంపిస్తున్నాడని చెప్పారు. ఎమ్మెల్యే వివేకానంద గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మూసీని రియల్ ఎస్టేట్ వాళ్లకు అప్పగించడానికే పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ హయాంలో సుందరంగా తీర్చిదిద్దితే.. ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని, దాంతో అనేక ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న కంపెనీలు వెళ్లిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సీఎం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి కూల్చివేతలు చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరం నుంచి ఒక మంత్రి లేడని, శాఖలన్నీ సీఎం వద్దనే ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా నగరంలో పలు పనులకు శంకుస్థాపనలు చేసి వదిలేశారని, మిగిలిన పనులన్నీ అరకొరగా జరుగుతున్నాయని చెప్పారు. రేవంత్రెడ్డి విధ్వంసకర నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారుతున్నదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని పేర్కొన్నారు.