హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తనకు పునర్జన్మ ప్రసాదించావంటూ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ కాళ్లపై పడి మొక్కారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి మాట్లాడారు. 2014 మైనంపల్లికి టీడీపీ టికెట్ దక్కకపోతే ఎంపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించారని, ఆ ఎన్నికల్లోనూ ఓడిపోతే తిరిగి గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చింది కేటీఆర్ కాదా? అని మైనంపల్లిని ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన మీడియాకు చూపించారు. బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు కేటీఆర్ షాడో సీఎం అన్న సంగతి గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. కేటీఆర్ అనుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవారని అన్నారు. అధికారం ఉన్నదని బజారు, చిల్లర భాష మాట్లాడుతున్నారని మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయనకు దమ్ముంటే కేటీఆర్‌పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై దాడులకు పాల్పడుతున్న మైనంపల్లిని రేవంత్‌రెడ్డి అదుపు చేయాలని సూచించారు.
శాంతి భద్రతలు, పాలన విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని వివేకానందగౌడ్ దుయ్యబట్టారు. కేటీఆర్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌లో విలేకరుల సమావేశాలు పెట్టి గాడ్సేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం మైనంపల్లి అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు ఇటుకతో కొడితే తాము రాయితో కొడతామని హెచ్చరించారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇండ్లపై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని పేర్కొన్నారు. పోస్టింగ్‌ల కోసం, పైరవీల కోసం తమ స్థాయిని తగ్గించుకోవద్దని పోలీసులకు హితవు పలికారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూ తగాదాల్లో పోలీసులు తల దూరుస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌పై దాడి జరిగితే, దానిపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రశ్నించారు. బట్టలు విప్పి కొడతామంటున్న మైనంపల్లిని పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పి కొట్టిన సంగతి మర్చిపోయారా? అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, చిరుమళ్ల రాకేష్ పాల్గొన్నారు.