ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపు నెలరోజులవుతున్నా పంటను కొనే దిక్కులేదని ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాని పరిస్థితి. కేంద్రాలు తెరిచిన చోట కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. గన్నీ సంచులు లేవని కాంటా పెడ్తలేరు. ఒకవేళ కాంటా పెట్టినా తరలించేందుకు లారీలు వస్తలేవు.
తరలించినా తరుగు తీస్తేనే దించుకుంటామని మిల్లర్లు కిటుకు పెడ్తున్నారు. సర్కార్, అధికార యంత్రాంగం తీరును నిరసిస్తూ రైతులు మంగళవారం పలుచోట్ల రోడ్డెక్కారు. రైతులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. అన్నదాతలంటే అలుసా? అని మండిపడ్డారు. తమను గోస పెడితే ఆ పాపం సర్కార్‌కు తగులుతుందని రైతులు శాపనార్థాలు పెట్టారు. నమస్తే తెలంగాణ నెట్వర్క్

తొగుట, మే 5: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల ఎక్స్ రోడ్లో రైతులు రాస్తారోకో చేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన ఎమ్మెల్యే వారికి మద్దతుగా మండుటెండలో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్నా చేస్తేనే వడ్లు కొంటరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కార్యాచరణ లేదని, సమస్యలకు పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): వరి, మకజొన్న కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను అరికట్టి, వేగంగా కొనుగోలు జరుపాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాం డ్ చేశారు. మంగళవారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని 90లక్షల టన్నులు సేకరిస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిందని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు 14లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు ప్రకటించారని తెలిపా రు. 8,500 కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేస్తామన్న ప్రభుత్వం.. కేవ లం 6,500 ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా 3 కిలోల నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐకేపీ కేంద్రా ల్లో రైతులకు కనీస సదుపాయాలు లేవని, గోనె సంచులు, టార్పాలిన్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మక్క జొన్నను కూడా క్వింటాల్‌కు రూ.600నుంచి రూ.800 తక్కువకు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ధాన్యంలో తాలు ఉన్నదని నెల రోజులకుపైగా కొనడం లేదంటూ వనపర్తి పట్టణ పరిధిలోని నర్సింగాయపల్లిలో రైతులు మంగళవారం రోడ్డుపై ధర్నాకు దిగారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కిరికిరి పెడుతున్నదని రైతులు ప్రశ్నించారు. కేవలం మూడు లారీల వడ్లను ఖరీదు చేసి మిల్లులకు తరలించి అదనపు తరుగు తీయడంపై మండిపడ్డారు.
– వనపర్తి, నమస్తే తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మానుకోట మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో మంగళవారం రైతులతో కలిసి ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ధాన్యం, మక్కలు కొనుగోలు చేయాలని నినదించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంటలను కాంటా పెట్టి బస్తాలను మిల్లులకు తరలించాలని, రైతులకు గన్నీ సంచులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
– నెల్లికుదురు

ధాన్యం కొనుగోలు చేపట్టాలని బీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం రైతులు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు గన్నీ బ్యాగులు అందించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ధాన్యం నిల్వచేసి 15 రోజులు గడుస్తున్నా గన్నీ బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు.
– ధన్వాడ

‘పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే అధికారులు పట్టించుకుంట లేరు.. మిల్లర్లు సిండికేట్‌గా మారి ఎక్కువ తూకం వేయించుకుంటున్నరు..
గిట్లయితే మేం వ్యవసాయం చేయలేం’ అని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతులలో మంగళవారం రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసినప్పుడు బస్తాకు రెండు కిలోలు తరుగు తీస్తున్నారని, మిల్లుకు పంపితే అక్కడా మరో రెండు కిలోలు తగ్గించి రైతులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
– కొడకండ్ల

యాదాద్రి జిల్లా గుండాల మండలం మరిపడిగలో సీతారాంపురం క్లస్టర్ ఏఈవో రామ్‌సింగ్ రైతుల పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకెళ్లగా క్రాప్ బుకింగ్ వివరాలు ట్యాబ్‌లో కన్పించకపోవడంతో కొనుగోలుకు నిరాకరించారు. దీంతో రైతులు మంగళవారం నిరసన తెలిపారు. విషయం కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి వెళ్లగా ఏఈవో రామ్సింగ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
– గుండాల

‘రాష్ట్ర ప్రభుత్వానికి అన్నదాతలంటే అలుసా? దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందులు పెడుతారా?’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను గోస పెడితే ఆ పాపం సర్కార్‌కు తగులుతుందని హెచ్చరించారు. మంగళవారం వెదిర వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల క్రితమే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చామని, తేమ శాతం వచ్చినా ఇప్పటివరకు ఎక్కడి కుప్పలు అక్కడే ఉన్నాయని వాపోయారు. ప్రభుత్వం రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నదని, ధాన్యం కొనుగోలులో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు.
– రామడుగు

ధాన్యం అమ్ముకోవడానికి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు ధాన్యం కాంటా వేసే పరిస్థితి కనిపించక పోవటంతో విసుగెత్తిన అన్నదాతలు మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి అనంతారం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
– తిరుమలగిరి

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేటలో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మూలుగుతున్నా పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. లారీలను పంపించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. క్వింటాళ్ల కొద్ది ధాన్యం పేరుకుపోతుంటే ఒకటి, రెండు లారీలు పంపితే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.
– బచ్చన్నపేట

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని అన్నాసాగర్ గేట్ వద్ద ప్రధాన రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆదివారం నుంచి హమాలీలు రాకపోవడంతో కాంటా పూర్తిగా నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.
– ఎల్లారెడ్డి రూరల్