హైదరాబాద్ : సింగరేణి(Singareni) కార్మిక నాయకుల అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని సంఘం గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni )అన్నారు. తెలంగాణ కొంగు బంగారమైన బొగ్గుగనులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టవద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్టు చేయడాన్ని ఎమ్మెల్యే కూనంనేని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్యానించారు.
కేంద్రం బొగ్గుగనులను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని నిల్వరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బహిరంగంగా చెప్పలేని పరిస్థితి ఉంటే నిరసన తెలియజేసే హక్కైనా ప్రజా సంఘాలకు ఇవ్వాలని ఆయన హితవు పలికారు. సింగరేణినిని కాపాడుకునేందుకు ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. భవిష్యత్లో ప్రజాఉద్యమాలను అడ్డుకునే చర్యలు పాల్పడవద్దని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.