హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఇటీవలకాలంలో ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో నిలుస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన మంత్రి పదవిపై మరోసారి ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మరో ట్వీట్ చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అవినీతిరహిత పాలనే ముఖ్యమని పేర్కొన్నారు. తన మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు ఇస్తానని చెప్పిన మంత్రి పదవి హామీని అమలు చేయకుండా కొందరు పార్టీ ముఖ్య నేతలే అడ్డుకుంటూ, అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వపాలన ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భట్టి ఆదివారం ఓ టీవీ చానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన పత్రిక క్లిప్పింగ్‌ను ఆయన పోస్టు చేశారు.