హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ‘ఏబీఎన్ రాధాకృష్ణా… పేపర్, చానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే మర్యాద దక్కదు. కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు నాలాంటి వ్యక్తులను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా బీ కేర్‌ఫుల్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉండొచ్చు.. అంత మాత్రాన నిజాయితీకి నిలువుటద్దంలా ఉద్యమంలో పోరాడిన మాలాంటి వ్యక్తులను కించపరిచే విధంగా, మా క్యారెక్టర్‌ను దెబ్బతీసే విధంగా కథనాలు రాస్తే బాగుండదు. అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మళ్లీ చెప్తున్నా మర్యాద దక్కదు’ అంటూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సీఎండీ రాధాకృష్ణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఆయన పేరు ప్రస్తావించి మరీ హెచ్చరించడం గమనార్హం. రాజగోపాల్‌రెడ్డి బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. బిల్లుల మంజూరుతో పాటు మంత్రి కొండా సురేఖ అంశంపైనా భట్టితో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. బయటకు వచ్చిన తర్వాత రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రా మీడియా’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల కొత్త పలుకులో తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నా, రేవంత్‌రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో సీనియర్లను అవమానించేలా కథనం ఉన్నదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.
కొందరు వ్యక్తుల కోసం.. కొన్ని ఆంధ్రా చానళ్ల కుట్ర
మీడియా అన్నా, జర్నలిస్టుల అన్నా తనకు గౌరవం ఉన్నదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కానీ మీడియా ముసుగులో తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, కించపరిచే విధంగా, తమను బలహీన పరిచే విధంగా కొన్ని ఆంధ్రా చానళ్లు ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. కొన్ని ఆంధ్రా చానళ్లు కొందరు వ్యక్తుల గురించి పని చేస్తున్నాయని ఆరోపించారు. కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు తన లాంటి వ్యక్తులను బలహీన పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏబీఎన్ స్టోరీ చూసిన తర్వాత తనకు ఈ విషయం అర్థమైందని తెలిపారు. కొండా సురేఖ, సుస్మిత, తనను కలిపి ఓ కథనం ప్లే చేశారని మండిపడ్డారు. చానల్, పేపర్ ఉంది కదా అని ఉల్టా సీదా కథనాలు రాసేస్తున్నారని మండిపడ్డారు. తనలాంటి వాడిపై కథనం రాయాలంటే ఒకటికి వెయ్యిసార్లు ఆలోచన చేయాలని హెచ్చరించారు. ‘వాళ్లు అనుకున్న వ్యక్తులను ప్రమోట్ చేసి, ఈ ప్రభుత్వంలో వాళ్లకు బెనిఫిట్ అయ్యేలా కీలక పాత్ర పోషించి, వెనుక నుంచి ప్రభుత్వాన్ని నడిపించాలని కలలు కంటున్నారేమో. తెలంగాణ లీడర్లను కంట్రోల్ చేయాలని అనుకుంటే అది మీ మూర్ఖత్వం. మాలాంటి వ్యక్తులను కించపరిచేలా, మా క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా కథనాలు వస్తే బాగుండదు. కేర్‌ఫుల్‌గా ఉండండి’ అని హెచ్చరించారు. .
ఆంధ్రా మీడియా సర్టిఫికెట్ మాకు అవసరం లేదు
తెలంగాణలో ఎంతో మంది నిజమైన ఉద్యమకారులు, నిజాయితీపరులు ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉండొచ్చు. నిజాయితీకి నిలువుటద్దంలా ఉద్యమంలో పాల్గొన్నాం. అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది’ అని వ్యాఖ్యానించారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరూ ఆంధ్రా మీడియాపై ఆధారపడి రాజకీయం చేయడంలేదని తెలిపారు. ఆంధ్రా మీడియా చానళ్లు తమకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల జోలికి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. ఏబీఎన్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నదో ఆలోచించుకోవాలని, కొంచెం ఒళ్లు దగ్గరపెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదని, లేకపోతే మర్యాద దక్కదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మా కెపాసిటీ ఏందో చూపించామనుకో తెలంగాణలో నీ చానల్, పేపర్ ఉండదు’ అంటూ రాధాకృష్ణకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మేం అనుకుంటే ఏబీఎన్ లాంటివి వంద చానళ్లు, ఆంధ్రజ్యోతి లాంటి వంద పేపర్లు పెడుతామని స్పష్టంచేశారు.
భట్టితో భేటీలో రాజకీయాలపై చర్చ లేదు
భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో రాజకీయాలపై చర్చ జరగలేదని చెప్పారు. కేవలం తన నియోజకవర్గ పెండింగ్ బిల్లులపైనే చర్చించినట్టు తెలిపారు. కొండా సురేఖకు సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిందని, దీనిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. తనదీ అదే మాట అని స్పష్టం చేశారు. తాను ఎక్కడా పార్టీకి, సీఎంకు, వ్యక్తులకు వ్యతిరేకంగా విమర్శలు చేయలేదని తెలిపారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచి గురించే మాట్లాడుతానని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డిని ఉద్దేశించేనా?
రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించినవేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా ‘ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఉన్నత స్థానంలో ఉండొచ్చు, కొందరికి అనుకూలంగా కథనాలు రాస్తున్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం వేరే ఉన్నదని అనుమానిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మొదటి నుంచీ సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య ఉన్న బంధమే ఇందుకు కారణమనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలోనే.. కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు తన లాంటి వ్యక్తులను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారని చెప్తున్నారు. తమది అసలైన కాంగ్రెస్ రక్తమని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని పదే పదే చెప్పడం కూడా రేవంత్‌ను ఉద్దేశించినవేనని పేర్కొంటున్నారు.