కరీంనగర్ రాంనగర్, సెప్టెంబర్ 6 : సాక్షాత్తు ఐజీ ఆదేశాలు ఇచ్చినా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి పట్టించుకోవడం లేదని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. దళిత పోలీసు అధికారులపై సీపీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఐజీ జోక్యం చేసుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఏ అధికారికి అన్యాయం జరిగినా దళితుల ప్రతినిధిగా తాను స్పందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
పోలీస్ అధికారుల పదోన్నతుల విషయంలో కమీషన్లు తీసుకుంటున్నట్టు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో నలుగురు దళిత సీఐల పోస్టింగ్ కోసం మాత్రమే తాను మాట్లాడానని తెలిపారు. పోస్టింగుల కోసం వారి వద్ద నుంచి చిల్లి గవ్వ తీసుకున్నట్టు నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఐజీ ఇచ్చిన ఆర్డర్‌ను సీపీ తిరసరించిన విషయం గురించి మాత్రమే తాను మాట్లాడానని వివరించారు. తాను కమిషనర్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు.