రవీంద్రభారతి, జూలై 7 : ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ డిమాం డ్ చేశారు. మాదిగ దండోర ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రవీంద్రభారతిలో ఘనం గా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, విమలక్క విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పలువురు మాదిగ పోరాటయోధులను సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణతోనే మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పాపన్న మాదిగ మాట్లాడుతూ.. 30 ఏండ్ల మాదిగల పోరాటంలో ఎందరో అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. లేకుంటే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.