హుజూరాబాద్ టౌన్, నవంబర్ 6: ‘దళితబంధు(Dalitha Bandhu) రెండో విడత నిధుల విషయంలో తలతెగినా వెనకడుగు వేసేది లేదు. అండగా ఉంటా. ప్రభుత్వంతో కొట్లాడుతా. ఈ నెల 20లోగా నిధులు ఇవ్వకపోతే హుజూరాబాద్ నియోజకవర్గం రణరంగం అవుతుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులను తిరగనివ్వబోమని’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
నాడు కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్‌లోని సుమారు 20వేల కుటుంబాలను ఆదుకున్నారన్నారు. రెండో విడత దళిత బంధు డబ్బులు వారి అకౌంట్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలను ఫ్రీజ్ చేసి దళితులను దగా చేస్తున్నదని మండిపడ్డారు. దళిత బంధు నిధుల విషయంలో కాంగ్రెస్ నాయకులు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు తనను కావాలని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు దళిత బంధుపై ప్రభుత్వాన్ని నిలదీశానని గుర్తు చేశారు.
ఈ నెల 9న హుజూరాబాద్‌లోని తన ఇంటి వద్ద టెంట్ వేసుకొని ఉంటానని, దళిత బంధు రెండో విడత రాని వారంతా వచ్చి తమ దరఖాస్తులు నేరుగా ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పండించిన పంటను గింజ కూడా కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని, ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి క్వింటాల్‌కు రూ.900 నష్టపోతూ అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.