హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు స్థానిక కమిటీల నియామకంతో మరోసారి రోడ్డెక్కింది. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో చెలరేగిన అసంతృప్తి సెగలు గాంధీభవన్‌కు తాకుతున్నాయి. పదవులు దక్కని నేతలు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, డీసీసీల తీరుపై భగ్గుమంటున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన కాంగ్రెస్ నేతలు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తీరును నిరసిస్తూ శుక్రవారం గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు.
నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కైలాశ్ మధ్య పొసగడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు కైలాశ్‌ను ఆహ్వానించకపోగా, ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో ముద్రించడం లేదు. ఇటీవల సీఎం పర్యటన అనంతరం మంత్రి కోమటిరెడ్డి అనుచరులు గుమ్ముల మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ పదవుల నుంచి తప్పించి వారిస్థానంలో పట్టణ అధ్యక్షుడిగా ఎడ్ల శ్రీనివాస్‌యాదవ్, నల్లగొండ రూరల్ అధ్యక్షుడిగా సైదులు, తిప్పర్తికి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.