హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీది మొండి చెయ్యి.. ఆ పార్టీ నేతలది తొండినోరు అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పథకాలను రద్దుచేయాలని చూస్తున్నదని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, ఎం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కడియం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై భగ్గుమన్నారు. ప్రజాదర్బార్ పేరిట సర్కారు దగా చేస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చింది కేవలం 6 గ్యారెంటీలు కాదని, వాటి కింద 420 హామీలు ఉన్నాయని, వాటిని అమలు చేయకుండా కాలయాపన చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన గృహలక్ష్మి పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చామని, ఆ పథకాన్ని రద్దుచేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సదరు లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వీరికి న్యాయం చేయాలని సూచించారు. దళితబంధు సాయాన్ని పెంచుతామని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్.. ఆ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నదని ఆరోపించారు. డిసెంబర్ 9 నుంచి రైతుబంధు, రైతు రుణమాపీ చెస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వానాకాలం పంట కొనుగోలు చేయడమే కాకుండా ఎకరానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు.
సీఎం హోదాలో ఉన్న ఏ నాయకుడైనా మాట్లాడితే అది ప్రభుత్వ ఉత్తర్వుతో సమానమని చెప్పారు. అలాంటిది సీఎం రేవంత్ మాట మార్చటం ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ మొదట ఫార్మాసిటీని ఎత్తేస్తున్నామని చెప్పి తెల్లారే మాట మార్చారని, మెట్రో రైల్ అలైన్మెంట్ మారుస్తామని ఆ తరువాత మార్చమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటనీ నిలదీశారు. అదానీ పనైపోయింది, ఇక ప్రధాని పనే మిగిలిందని నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో చెప్పిన సీఎం రేవంత్.. హైదరాబాద్‌లో అదానీకి రెడ్ కార్పెట్ పరిచారని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రెండు అమలు చేశామంటూ పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు యువవికాసం కింద భృతి రూ.4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. అసెంబ్లీ సాక్షిగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా తాము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని మాట మార్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి.. తొండినోరు అని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చార్సౌబీస్ అని తాము అనలేదని, ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలే 420 అని గుర్తుచేశారు.
ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో వేసేందుకు సిద్ధం చేసిన రైతుబంధు సొమ్ము రూ.7,700 కోట్లు రాఘవ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి వెళ్లాయా? అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. రైతుబంధు కోసం సిద్ధంచేసిన పైసలు ఏ కాంట్రాక్ట్ సంస్థలకు వెళ్లాయని నిలదీశారు. రైతుల ఖాతాల్లోకి వెళ్లకుండా ఆ సొమ్ము ఎక్కడికిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లటం కప్పం కట్టడమే పాలనగా సాగిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పనిగట్టుకొని కాంగ్రెస్ చేస్తున్న దాడులను ఎండగడతామని చెప్పారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆటోడ్రైవర్ సతీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఉదహరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సింగరేణి క్వార్టర్లలో తామెవరినీ ఖాళీ చేయించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయిస్తున్నదని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాపాలన కాదని, దరిద్రపు పాలనని, నియంతృత్వ ఫాసిస్ట్ పోకడలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామని స్పష్టంచేశారు.