హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా ప్రియాంకగాంధీ పాల్గొన్న యూత్ డిక్లరేషన్‌లో ప్రతి నిరుద్యోగికి 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. మ్యానిఫెస్టోకు అభయ హస్తం పేరు పెట్టి.. కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఉప సీఎం, ఆర్థిక మంత్రి తాము ఎకడా నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని బుకాయించడం దారుణమని, ఇచ్చిన హామీలను ఇవ్వలేదంటూ బుకాయిస్తున్నదని విమర్శించారు.
సీఎం క్షమాపణ చెప్పాలి : గోపీనాథ్
జూబ్లీహిల్స్ ప్రజలు వరుసగా మూడుసార్లు తనను గెలిస్తే ఎంఐఎంతో కుమ్మక్కై గెలిచానని అసెంబ్లీలో సీఎం చెప్పడం దారుణమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. సీఎం ఇలా మాట్లాడి ప్రజలను అవమానించొద్దని, తక్షణమే తన నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తీరును ఖండిస్తూ.. ఆయన మాట్లాడేందుకు సభలో మైక్ ఇవ్వకపోవడంతో సభ జరుగుతుండగానే.. వివేకానంద్గౌడ్తో కలిసి నేరుగా మీడియా పాయింట్‌కు వచ్చి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించేలా సీఎం మాట్లాడారని, ఎంఐఎంతో కుమ్మకయ్యారని సీఎం అనడం, ఆయన హోదాకు సరికాదని సూచించారు.