ఆదిలాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ పర్యటనలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు చిల్లర రాజకీయాలను తలపించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA Ramanna )విమర్శించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభిం చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసిన ఫలితం లేదని, కేంద్రం సిమెంటు పరిశ్రమలోని స్క్రాప్ ను అమ్మకానికి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు అమిత్ షా కు లేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యమ నేపథ్యం ఉంది.
తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడారు. అమిత్ షా కొడుకు జైషా బీసీసీఐలో పదవి అనుభవిస్తున్నారు. ఆయనకు క్రికెట్ అంటే తెలుసా? ఎప్పుడైనా క్రికెట్ ఆడిన చరిత్ర ఉందా అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ఎలాంటి సహాయం చేయకున్నా అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. విద్వేషాలు రెచ్చగొడుతూ..పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న బీజేపీపీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.