హైదరాబాద్ : కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( MLA Jeevan Reddy ) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటిస్తే ముక్కు నేలకు రాస్తానన్న బండి సంజయ్, గన్ పార్క్ ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. వయో పరిమితి పెంచిన దృష్ట్యా రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న బీజేపీ నాయకులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదన్నారు. కేసీఆర్ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పని లేకుండా పోయిందని, ఇది వాళ్లకు ఒక చీకటి రోజు అన్నారు. సీఎం కేసీఆర్ కలలు కన్న నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ.. నేటితో సాకారమైందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు మార్చి 9వ తేదీన పండుగలా వేడుకలు చేసుకోవాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ నిరుద్యోగుల కోసం సొంత ఖర్చులతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.