హైదరాబాద్: కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఆయన అసెంబ్లీలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎంపీలతో తెలంగాణకు నష్టమే తప్ప లాభం లేదన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. ప్రభుత్వరంగ భారత్‌ను ప్రైవేట్ రంగ భారత్‌గా మార్చిందని విమర్శించారు. కాషాయ పార్టీ గుజరాత్ బేరగాళ్ల పార్టీగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ రూ.3 లక్షల కోట్ల మేర ఖర్చుపెట్టి రైతులకు లాభం చేకూర్చే పనిచేస్తే కేంద్రం వారి నడ్డి విరుస్తున్నదని దుయ్యబట్టారు.
సింగరేణి బ్లాక్‌ల వేలాన్ని అడ్డుకుని కాషాయదళం ఎంపీలు తమ నిజాయితీని చాటుకోవాలన్నారు. వారిని రైతులు, కార్మికులు ఉరికించి కొట్టడం ఖాయమని వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఉద్యోగాలకు ఎసరుపెట్టాలని చూస్తున్నారని, కొందరు బడా వ్యాపారులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వమని, ఆ పార్టీ కార్యాలయానికి భవిష్యత్‌లో టూలెట్ బోర్డులు తగిలించాల్సిందేనని ఎద్దేవాచేశారు.