సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులతో జగ్గారెడ్డి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెప్పాను.. తాను చెప్పినట్లే జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కొందరి విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెబుతున్నా… తాను చెప్పిందే జరుగుతుందన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసే వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. వారిద్దరి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాని యెడల.. ఇండిపెండెంట్గా ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో మార్చి 21న నియోజకవర్గానికి చెందిన లక్ష మందితో సభ నిర్వహిస్తానని పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో గతంలో రాహుల్ గాంధీ సభ నిర్వహించిన అంబేద్కర్ స్టేడియంలో లక్ష మందితో మళ్లీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నానని తెలిపారు. జగ్గారెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అనేది ఆ సభలో వెల్లడిస్తాను అని ఆయన స్పష్టం చేశారు.