సూర్యాపేట, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది కాకముందే అన్ని రంగాల ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖ సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నదని ఆరోపించారు. సోమవారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే బాంబులు వేస్తామంటున్నారని, అసలు రేవంత్ మాటలు సీఎం హోదాను దిగజార్చేలా ఉన్నాయని విమర్శించారు. మూసీకంటే దుర్గంధమైన నోటితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని దూషిస్తున్నారని దుయ్యబట్టారు. ఏడాదిలోనే ప్రభుత్వం ప్రజలకు పాలన అందించడంలో ఫెయిల్ అయినందుకు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే.. మరో పక్క ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేక రోగులు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావని తెలిపారు. సాగునీరు లేక, మద్దతు ధర రాక రైతులు రోడ్డెక్కి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి కొనే దిక్కులేదని, నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. దళారుల చేతుల్లో రైతుల దోపిడీకి కారణం మంత్రులేనని, రైతులను దోపిడీ చేస్తున్న సొమ్ము వందల కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. వికారాబాద్‌లో ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎదిరించి ఆత్మరక్షణకు రైతులు దాడులకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ పరిపాలనకు వికారాబాద్ దాడి ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు.