సూర్యాపేట, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కరెంట్ ఇవ్వడం చేతకాక విద్యుత్తు శాఖలో అప్పులు పేరుకుపోయాయంటూ సాకులు చెప్పి తప్పించుకుంటున్నదని మాజీ విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టేందుకు కొంత అప్పు చేయాల్సి వస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తేకుండా కరెం ట్ ఎలా ఇస్తుందో చూస్తామని అన్నారు. అప్పుల విషయమై అసెంబ్లీలో తనను అడిగితే సమాధానం చెప్పేవాడినని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వి ద్యుత్తు ఉత్పత్తి 6 వేల మెగావాట్లు అయితే ప్రస్తుతం తెలంగాణలో 18 వేల మెగావాట్లకు చేరుకున్నదని అన్నారు. నాడు జెన్కో ఆస్తులు రూ.18 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.50 వేల కోట్లకు చేరుకున్నట్టు చెప్పారు. అప్పట్లో 6 గంటలు కరెంట్ ఇస్తే కేసీఆర్ సర్కారు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించిందని గుర్తుచేశారు. హామీల అమలుకు దమ్మూ, ధైర్యం ఉండాలని.. సాకులు చెబితే నడువదని అన్నా రు. అసెంబ్లీలో కరెంట్‌పై చర్చను తానే పెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తానని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పాల్గొన్నారు.