సూర్యాపేట : కాంగ్రెస్(Congress) పార్టీ మళ్లీ గెలవదని అర్థమైంది. అందుకే అడ్డూ అదుపు లేనిపాలన సాగిస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సూర్యాపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై నిప్పులు చెరిగారు. ఎట్లున్న రాష్ట్రం ఎట్లాయితుందో చూస్తున్నారుకదా.కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంతో ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు.సాగునీరే కాదు తాగు నీరు కూడా సక్కగ ఇస్తలేరు. ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చినయే అందుత లేవని జనం అంటున్నారని గుర్తు చేశారు. పెంచుతామన్నా పెన్షన్లు ఇంకా ఎన్నడు పెంచి ఇస్తారు? ఆడబిడ్డల పెండ్లిళ్లకు కేసీఆర్ పెట్టిన లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తరు..ఆడపిల్లలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటుపోయినవి ప్రశ్నించారు.
ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లు ఇండ్ల ముందుకు వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు ఓపికపట్టుకుంటే వచ్చేది మల్లా కేసీఆర్ ప్రభుత్వమేనని ఎవరు అధైర్య పడవద్దు, ఐక్యతతో విజయాలు సాధించుకుందామని స్పష్టం చేశారు.