హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు కిలిమంజారో వంటి పర్వతాలు అధిరోహిస్తే, రేవంత్‌రెడ్డి హయాంలో పురుగుల అన్నం పెట్టొద్దని రోడ్లు ఎక్కుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు గురుకులాలు అద్భుతంగా ఉంటే బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్వీ నాయకులను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బాల్కసుమన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వ సత్తా ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
పోలీసులతో సాగుతున్న పాలన చూసి ప్రజలంతా మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దితే, రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో చదువుతున్న తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనగా ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం తమ పిల్లలను కలిసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలను జైళ్లలా మారుస్తున్నారని ఆరోపించారు.
గురుకులాల పరిస్థితిపై అధ్యయనం చేస్తే రేవంత్‌రెడ్డికి వచ్చిన ఇబ్బందేంటి? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే బీఆర్ఎస్ బృందాలు గురుకులాల్లో పర్యటిస్తున్నాయి. మేం ధర్నాలు చేసేందుకో, తరగతులు బహిష్కరించాలని చెప్పేందుకో వెళ్లడం లేదు. సమస్యలు తెలుసుకుందామని మాత్రమే వెళ్తున్నాం. గురుకుల బాట పట్టిన బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రికి ఎందుకంత భయం. పిల్లలకు సరిగా అన్నం కూడా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వమిది.
‘లగచర్లకు వెళతామంటే అనుమతి ఇవ్వరు. మహబూబాబాద్‌లో మీటింగ్‌కు అనుమతివ్వరు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు, లాఠీచార్జిలు.. ఇంకా ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు, ఎంతకాలం ఈ మోసాలు’ అని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ పూర్తికాలేదని, దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ వడ్ల కొనుగోలుపై లెకలు చెప్పడం లేదని, రైతు భరోసా కన్నా బోనస్ బాగుందని చెప్పడానికి మంత్రికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క పోలీసుశాఖకు తప్ప, ఏ శాఖకూ సరైన పనిలేదని అన్నారు. రాష్ట్రంలో దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదని ఆరోపించారు. ఏం చేశారని సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ బానిసలకు అధికారం అప్పజెప్పొద్దని కేసీఆర్ మొత్తుకున్నారు. ఏడాదిలో సీఎం 30 సార్లు ఢిల్లీ వెళ్లారు? ఏం సాధించారు?’ అని ప్రశ్నించారు. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో పోలీసుల అత్యుత్సాహం వల్ల ఒకే ఒక్క ఎన్కౌంటర్ జరిగినట్టు జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎన్కౌంటర్లలో 16 మంది చనిపోయారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై ఆరోపణలు వస్తే వెంటనే విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది బీఆర్ఎస్ అయినట్టు కాంగ్రెస్ నేతలు ప్రతి అంశంలో తమ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో విషాహారం వెనక బీఆర్ఎస్ కుట్ర అని చెప్పడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివిధ శాఖలకు మంత్రులు లేకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధాన కారణమని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ‘విద్యా శాఖకు మంత్రి లేకపోవడం ఏమిటి? విద్యాశాఖ కీలకమైందన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. రేవంత్‌రెడ్డికి దేనిపైనా పట్టింపు లేదు. వేరే విషయాలపై ఆయనకు శ్రద్ధ ఉంది. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం దుర్మార్గం, అత్యంత మూర్ఖత్వం’ అని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి మంత్రివర్గ విస్తరణ చేసే దమ్ము లేదని, కనీసం వేరే మంత్రులకు విద్యాశాఖ అప్పగించాలన్న ఇంగితం కూడా లేదని దుమ్మెత్తి పోశారు. ప్రజలు కేంద్రంగా రేవంత్ ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. తనకిష్టమైతే తప్ప మంత్రులను సీఎం కలవడం లేదని, ఇక అధికారులను ఏం కలుస్తారని ప్రశ్నించారు. కనీసం కోదండరాంకైనా విద్యాశాఖను కేటాయించాలని, లేదంటే తన శత్రువులుగా ఉన్న మంత్రులకైనా ఇవ్వాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.