హైదరాబాద్, జూలై 27(నమస్తేతెలంగాణ): బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘అసలు తెలంగాణకు అక్కరకు రాని, ఈ ప్రాంత ప్రజలకు అక్కరేలేని పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాదు కదా.. బీజేపీని బీఆర్ఎస్లో కలుపుతామన్నా మేము ఒప్పుకోబోం. ఏనాడో ఈ విషయంలో కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి రాదు’ అని కుండబద్దలు కొట్టారు. భవిష్యత్తులో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. కవితకు బెయిలిస్తే బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతామని చెప్పినట్టుగా అసంబద్ధ వాదనలను తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ భవన్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు దుర్మార్గాలకు తెగబడుతున్నారని తెలిపారు.
మళ్లీ దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలనపై చర్చ జరుగుతున్న ఈ తరుణంలో కొందరు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని తూర్పారబట్టారు. బీజేపీలో ప్రాధాన్యంలేని ఎంపీ సీఎం రమేశ్‌తో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ చర్చలెందుకు జరుపుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రమేశ్.. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రీఫ్ట్లను చదవడం బంద్ పెట్టి, స్కిట్లను కట్టిపెట్టాలని హితవు పలికారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి తరచూ అబద్ధాలు ఆడుతున్నారని, బనకచర్లపై తప్పుదారి పట్టించేందుకు అవసరంలేని విషయాలను తెరపైకి తెస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు కట్టుకునేందుకు కమిటీకి ఒప్పుకుని బుకాయిస్తున్నారని విమర్శించారు. తన ఆరోపణలు అబద్ధమైతే ఏపీ మంత్రి నిమ్మల మాటలకు ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు. తన గురువు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమై తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అబద్ధాల్లో గోబెల్స్‌ను మించిపోయారని, సినిమాల్లో రావుగోపాల్రావు, కోటా శ్రీనివాస్‌రావును తలదన్నేలా డైలాగులు చెప్తూ రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సోనియాగాంధీ అవార్డు గ్రహీత అయిన ఆయన మానసిక స్థితిపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చురకలంటించారు. రేవంత్ అబద్ధాలు వింటే గోబెల్స్ కూడా ఆత్మహత్య చేసుకొనేవాడేమోనని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని జైపాల్‌రెడ్డిని నాడు తెగనాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అకాశానికి ఎత్తడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన మాటలు వింటే జైపాల్‌రెడ్డి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆయన ఏనాడూ రేవంత్‌రెడ్డిని మనిషిలాగా చూడలేదు. క్యారెక్టర్‌ను కరెక్ట్‌గా అంచనా వేసి దూరంపెట్టారు’ అని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి ఆంధ్రా బాబుల అడుగులకు మడుగులొత్తుతున్నారని దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినా.. గల్లీలో సభ పెట్టినా కేసీఆర్ నామస్మరణ చేయడం పరిపాటిగా మారిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కానీ కేసీఆర్ ఏనాడూ రేవంత్‌రెడ్డి పేరు ఉచ్ఛరించనేలేదని చెప్పారు. ఆయన నీచపు పనులు, కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న తెలంగాణను చూసి కేసీఆర్ బాధపడుతున్నారని తెలిపారు. 20 నెలల రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, నాడు జరిగిన అభివృద్ధిని చెడగొట్టడం తప్ప ఉద్ధరించిందేమీలేదని మండిపడ్డారు. అయినా కేసీఆర్‌కు ఉన్న విజ్ఞత ఎంత? రేవంత్‌కు ఉన్న విచక్షణ ఎంత? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తులు ఐదేండ్లు సీఎం సీట్లో కూర్చుంటేనే ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తుందని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆయనను దించేస్తే తాము మాత్రం చేసేదేమీ లేదని తేల్చి చెప్పారు. ‘బీఆర్ఎస్ హయాంలో అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిచిన తెలంగాణను అధోగతి పాల్జేస్తున్నారు.. తప్పుడు మాటలు.. తప్పటడుగులతో రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నారు’ అని విమర్శించారు. మీటింగ్‌కు రానని సోనియా రాసిన లేఖను చూపుతూ వచ్చీరాని ఇంగ్లిష్ భాషలో ఆస్కార్, నోబెల్ అవార్డులతో సమానమని గోబెల్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్క్రిఫ్ట్ రాసిస్తున్న పీఆర్వోలు కూడా ఆయన పరువు తీస్తున్నారని తెలిపారు.
ఆర్థిక నేరగాడైన సీఎం రమేశ్‌కు ఎంపీ పదవి ఇచ్చి రాజకీయ రూపమిచ్చింది చంద్రబాబేనని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. అందుకే ఆయన బీజేపీలో చేరినా ఆత్మమాత్రం చంద్రబాబుతోనే ఉన్నదని విమర్శించారు. హెచ్‌సీయూ భూముల తాకట్టుకు సహకరించిన సీఎం రమేశ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్‌ను బహుమానంగా ఇచ్చారని విమర్శించారు. ఈ అక్రమ కాంట్రాక్ట్‌ను బట్టబయలు చేసిన కేటీఆర్‌పై సీఎం రమేశ్ ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ‘కాంట్రాక్ట్ సక్రమమే అయితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ముడుపుల ముచ్చట లేకుంటే కుడితిలో పడ్డ ఎలుకల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు? కేటీఆర్ తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీలను బయట పెడతామని చెప్పడమెందుకు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంట్రాక్ట్‌లు, కమీషన్ల కోసం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిన సీఎం రమేశ్ పొద్దున లేస్తే ఢిల్లీలోని వారి ఇండ్లకు వెళ్లేవారని ఆరోపించారు. రేవంత్ నివాసం తుగ్లక్ మార్గ్‌లోని 23వ నంబర్ ఫ్లాట్‌కు వెళ్లేవారని పేర్కొన్నారు. ఆ సీసీ ఫుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇంతకాలం ఫోన్ ట్యాపింగ్‌పై రాద్ధాంతం చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తన సహచర మంత్రుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆయన క్యాబినెట్‌లోని ఓ మంత్రి తన కుటుంబసభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడేందుకు కూడా గజగజ వణుకుతున్నారని తెలిపారు. రేవంత్ దెబ్బకు పెద్ద ఫోన్‌ను పక్కన పారేసిన ఆ మంత్రి ఇటీవలే ఓ డబ్బా ఫోన్‌ను కొనుక్కున్నారని చెప్పారు.