సూర్యాపేట : శాంతి, సహనానికి క్రిస్మస్ ప్రతీక అని.. ఏసుక్రీస్తు(Jesus Christ) మహోన్నత క్షమా గుణసంపన్నుడని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కుడా క్షమించండి అంటూ వేడుకున్న దయార్ద్ర హృదయుడని.. అటువంటి మహనీయుల బోధనలు ఆచరనీయమని ఆయన పేర్కొన్నారు. సోమవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చీలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సాహాయిల పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల కుడా క్షమాగుణం కలిగి ఉన్న కరుణామయుడు ఏసుక్రీస్తు అని ప్రశంసించారు. ఆయన బోధనలు, శాంతి సామరస్యాలను ఇనుమడింప చేస్తాయన్నారు.
సర్వమతలా సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, తదితరులు పాల్గొన్నారు.